కురాన్ - 7:54 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).
إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ
నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు[1]. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు[2]. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు[3], సర్వ లోకాలకు పోషకుడు!
[1] యౌమున్: దినం, మనం లెక్కిస్తున్న దినం (ఒక పగలు-రాత్రితో కూడుకున్నది), ఈ భూలోకానికే పరిమితిమైనది. ఇది మన భూలోక వాసుల అనుకూలం కొరకు అల్లాహ్ (సు.తా.) నిర్ణయించిన దినం. దీని సంబంధం భూమి సంచారంతో ఉంది. అల్లాహుతా'ఆలా ఇక్కడు: "ఆకాశాలు మరియు భూమిని ఆరు దినాలలో సృష్టించాను." అని అంటున్నాడు. ఈ యౌమున్, అంటే యుగం, దశ లేక కాలం (Aeon, Epoch) కావచ్చు! నిజం అల్లాహ్ తెలుసు. [2] అల్లాహ్ (సు.తా.) ఏ విధంగా తన 'అర్ష్ ను (సింహాసనాన్ని/విశ్వాధికార పీఠాన్ని) అధిష్ఠించి ఉన్నాడో మనకు తెలియదు. మనం దానిని మానవ జ్ఞానపరిధి ప్రకారం ఉదాహరణలతో వివరించటం తగినది కాదు. మనము ఇలాంటి విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా విశ్వసించటమే నిజమైన విశ్వాసం (ఇబ్నె-కసీ'ర్). ఇది ముతషాబిహాత్ - అస్పష్టమైన విషయాలలోనిది. ఈ శబ్దం ఖుర్ఆన్ లో చాలా చోట్లలో వచ్చింది. చూడండి, 7:54, 9:129, 10:3, 11:7, 13:2, 20:5, 25:59, 32:4 57:4. [3] తబారక్: Blessed, Exalted, శుభదాయకుడు, శుభప్రదుడు, శుభకరుడు, అనుగ్రహించు, ఆశీర్వదించు, వరాలను, శుభాలను ప్రసాదించు, ఘనతగల, మహిమ గల వాడు..
సూరా సూరా అరాఫ్ ఆయత 54 తఫ్సీర్